‘వేట్టైయాన్- ది హంటర్’ సినిమా పెద్ద హిట్ అవుతుంది..లైకా ప్రొడక్షన్స్ నా సొంత నిర్మాణ సంస్థలాంటిది.. డైరెక్టర్ టి.జె.జ్ఞానవేల్ ఇంకా గొప్ప స్థాయికి ఎదగాలి - ఆడియో వేడుకలో సూపర్‌స్టార్ రజినీకాంత్
సూపర్‌స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘వేట్టైయాన్- ది హంటర్’. దసరా సందర్భంగా అక్టోబర్ 10న రిలీజ్ అవుతుంది. టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సంస్థ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మించారు. శుక్రవారం ఈ సినిమా ఆడియో వేడుకల చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో..
సూపర్‌స్టార్ రజినీకాంత్ మాట్లాడుతూ ‘‘వేట్టైయాన్- ది హంటర్’ సినిమా నిర్మాణం చేసిన లైకా ప్రొడక్షన్స్ సంస్థకి, మంజు వారియర్, రానా దగ్గుబాటి సహా ఇతర నటీనటులకు, సినిమాకు వర్క్ చేసిన టెక్నీషియన్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరికీ ధన్యవాదాలు. సాధారణంగా సినిమా హిట్ తర్వాత ఫ్లాప్ ఇస్తే హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్‌లో ఓ టెన్షన్ ఉంటుంది. నెక్ట్స్ ఎలాగైనా హిట్ మూవీ ఇవ్వాలని అనుకుంటారు. హిట్ తర్వాత హిట్ మూవీ ఇవ్వాలనే టెన్షన్ అందరికీ ఉంటుంది. సాధారణంగా హిట్ కావాలంటే ఓ మ్యాజిక్ జరగాలి. అన్నీ అలా కుదరాలి. జైలర్ మూవీ హిట్ తర్వాత నేను కథలు విని, కొన్నాళ్లకు కథలు పెద్దగా వినటం మానేశాను. ఆ సమయంలో సౌందర్య, డైరెక్టర్ జ్ఞానవేల్‌ను కలిసింది. అప్పటికే నేను జై భీమ్ సినిమాను చూసి ఉన్నాను. సాధారణంగా మంచి సినిమాలను చూసినప్పుడు సదరు దర్శకులకు ఫోన్ చేసి మాట్లాడటం నాకు అలవాటు. కానీ ఎందుకనో జ్ఞానవేల్‌తో నేను మాట్లాడలేదు. ఆ సమయంలో సౌందర్య నా దగ్గరకు వచ్చి జ్ఞానవేల్ దగ్గర మంచి లైన్ ఉందని, వినమని నాతో చెప్పింది. అప్పుడే నాకు జ్ఞానవేల్ డైరెక్టర్ కావటానికంటే ముందు ఓ జర్నలిస్ట్ అని తెలిసింది. మరోసారి జైభీమ్ సినిమా చూశాను. ఎవరి దగ్గర దర్శకత్వ శాఖలో పని చేయని వ్యక్తి, జై భీమ్‌ను ఎంత గొప్పగా ఎలా తీశాడా అని ఆలోచించాను. తర్వాత జ్ఞానవేల్‌తో ఫోన్లో మాట్లాడి కలిశాను. మీరు సందేశాత్మక సినిమాలు తీస్తుంటారు. కానీ నాతో కమర్షియల్ సినిమాలు తీయాలి. మీ స్టైల్ వేరు, నా స్టైల్ వేరు అని చెప్పాను. తర్వాత తను చెప్పిన కథ విన్న తర్వాత నాకు నచ్చింది. దాన్ని డెవలప్ చేయమని చెప్పాను. పది రోజుల సమయం అడిగిన డైరెక్టర్.. రెండు రోజుల్లో మళ్లీ ఫోన్ చేసి నేను లోకేష్, నెల్సన్ స్టైల్లో కమర్షియల్ సినిమా చేయలేను.. నా స్టైల్లో నేను చేస్తానని అన్నారు. నాకు కూడా అదే కావాలని నేను అనటంతో ఆయన కథను తయారు చేశారు. తర్వాత సుభాస్కరన్‌ను కలిసి కథ చెప్పగా, ఆయనకు నచ్చింది. లైకా ప్రొడక్షన్స్ అంటే నా సొంత బ్యానర్‌లాంటిది. మీకు ఎలాంటి సినిమా కావాలో అలాంటి సినిమా చేద్దాం సార్ అన్నారు సుభాస్కరన్. మెల్లగా పెద్ద పెద్ద టెక్నీషియన్స్ సినిమాలో యాడ్ అయ్యారు. అమితాబ్ పాత్ర గురించి జ్ఞానవేల్ చెప్పి, ఆయనే చేయాలని చెప్పగా, నిర్మాతలతో మాట్లాడమని చెప్పాను. డైరెక్టర్‌గారు సుభాస్కరన్‌తో మాట్లాడి అమితాబ్‌ను ఒప్పించారు. అలా ఆయన టీమ్‌లో భాగమయ్యారు. ఎప్పుడైతో అమితాబ్‌గారు ఇందులో నటింటానికి ఒప్పుకున్నారని తెలిసిందో అప్పుడు నాలో ఉత్సాహం ఇంకా పెరిగింది. ఎందుకంటే వృత్తిపరంగానే కాదు, పర్సనల్‌గానూ అమితాబ్ నాకు ఇన్‌స్పిరేషన్ ఇచ్చిన వ్యక్తి. ఇప్పటి జనరేషన్ పిల్లలకు అమితాబ్‌గారు ఎంత పెద్ద నటుడో తెలియదు. నేను ఆయన్ని దగ్గర నుంచి చూశాను. ఫహాద్ ఫాజిల్ పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఆ పాత్రను తనెలా చేస్తాడోనని అనుకున్నాను. తను చాలా సింపుల్‌గా యాక్ట్ చేసేశాడు. ఈతరంలో తనలాంటి నటుడ్ని నేను చూడలేదు. రామానాయుడుగారి మనవడిగా రానా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. బయటకు నార్మల్‌గా మాట్లాడుతూ కనిపించినా, కెమెరా ముందుకు రాగానే యాక్టర్‌గా ఆయన మారిపోతారు. తను చాలా మంచి యాక్టర్. బాహుబలి సహా ఎన్నో సినిమాల్లో మెప్పించిన నటుడు. అనిరుద్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నా బిడ్డలాంటోడు. జ్ఞానవేల్ చాలా మంచి వ్యక్తి. తన కోసం ఈ సినిమా హిట్ కావాలని అనుకుంటున్నాను. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని, జ్ఞానవేల్ ఇంకా గొప్ప స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను` అన్నారు.
అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ `రజినీకాంత్‌తో చాలా సంవత్సరాలుగా మంచి పరిచయం ఉంది. వృత్తి పరంగానే కాదు, వ్యక్తిగతంగానూ తను నాకెంతో సన్నిహితంగా ఉంటారు. రజినీకాంత్ పాత్ర గురించి, నా పాత్ర గురించి తెలిసిన తర్వాత నేను జ్ఞానవేల్ నెరేషన్ నచ్చి సినిమా చేయటానికి ఒప్పుకున్నాను. రజినీకాంత్‌తో యాక్ట్ చేయటానికి గొప్పగా, గర్వంగా భావిస్తున్నాను. తను మనందరికీ ఓ మంచి గిఫ్ట్. గ్రేట్ హ్యుమన్ బీయింగ్. చాలా సింపుల్‌గా కనిపిస్తారు. అక్టోబర్ 10న వేట్టైయాన్ రిలీజ్ అవుతుంది. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను` అన్నారు.
డైరెక్టర్ టి.జె.జ్ఞానవేల్ మాట్లాడుతూ జై భీమ్` మూవీ హిట్ అయిన తర్వాత నాకు అవకాశం వస్తుందని తెలుసు. కానీ ఇలాంటి గొప్ప అవకాశం వస్తుందని అనుకోలేదు. సాధారణంగా జై భీమ్ హిట్ అయిన తర్వాత మంచి సినిమాలను అప్రిషియేట్ చేసే రజినీకాంత్‌గారి దగ్గరి నుంచి నాకు ఫోన్ వస్తుందని అనుకున్నాను. కానీ వారం దాటినా కూడా కాల్ రాలేదు. రెండో వారంలో సౌందర్య రజినీకాంత్‌గారు నాకు ఫోన్ చేసి అభినందించారు. అదే సమయంలో నాన్నగారికి మీ దగ్గర మంచి లైన్ ఉంటే చెప్పమని అన్నారు. నేను ముందు నమ్మలేదు. తర్వాత నా దగ్గర రెండు లైన్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఇన్‌టెన్స్ ఉన్న లైన్ అయితే, మరోటి కామెడీ టచ్‌తో సాగే కాన్సెప్ట్. ముందుగా సౌందర్యగారికి ఇన్‌టెన్స్ లైన్ తో ఉన్న వేట్టైయాన్ వినిపించాను. ఆమెకు ఈ లైనే నచ్చింది. తర్వాత రజినీకాంత్‌గారితో మాట్లాడాను. ఆయనకు సన్నివేశాలు రాసే సమయంలో ఆయన మాత్రమే చేయగలడు అనేలా మాస్ సన్నివేశాలు కుదిరాయి. కథ రాసుకునే సమయంలోనే అమితాబ్, ఫహాద్ ఫాజిల్, రానా.. ఇలా అందరినీ ఉహించుకునే రాసుకున్నాను. రజినీకాంత్‌గారు, లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఉండటం వల్లనే వారందరినీ ఈ సినిమాలో యాక్ట్ చేసేలా ఒప్పించగలిగాను. సుభాస్కరన్‌గారు కథ వినగానే మీకెలా కావాలో సినిమాను అలా చేయండి అన్నారు. ఆయన చెప్పినట్లుగానే తమిళ్ కుమరన్‌గారు నాకు సపోర్ట్‌ను అందించారు. రజినీకాంత్‌గారు, అమితాబ్‌గారి నుంచి లైఫ్ లెసన్స్ నేర్చుకున్నాను. అభిమానులు సినిమాను ఊహించుకున్న దాని కంటే ఎక్కువగానే వేట్టైయాన్ సినిమా ఉంటుంది. ప్రతి చిన్న మూమెంట్‌ను ఎంజాయ్ చేస్తారు`` అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ మాట్లాడుతూ వేట్టైయాన్ సినిమా చేసిన రజినీగారికి, లైకా ప్రొడక్షన్స్‌కి ముందుగా ధన్యవాదాలు. జ్ఞానవేల్‌తో సినిమా అనగానే తను నాకు సెట్ అవుతాడా? అని ఆలోచించాను. కానీ తనను కలిసిన తర్వాత నాకు కొత్తగా అనిపించింది. రజినీకాంత్‌గారిని ఓ ఇన్‌టెన్స్ క్యారెక్టర్‌లో కొత్తగా చూస్తారు. నేను రజినీగారికి పెద్ద అభిమానిననే విషయం అందరికీ తెలిసిందే. ప్రతీసారి ఆయనతో వర్క్ చేసేటప్పుడు గూజ్‌బమ్స్ వస్తాయి. నాకు సపోర్ట్ చేసిన టీమ్‌కు, మేకర్స్‌కు ధన్యవాదాలు అన్నారు.
మంజు వారియర్ మాట్లాడుతూ తమిళంలో నేను అసురన్, తునివు అనే సినిమాలు మాత్రమే చేశాను. కానీ నాకు దొరికిన ఆదరణ చూస్తుంటే మాటలు రావటం లేదు. ఇప్పుడు వేట్టైయాన్ మూడో సినిమా. జై భీమ్ సినిమా చూసిన తర్వాత జ్ఞానవేల్ దర్శకత్వంలో సినిమా చేయాలని అనుకున్నాను. కానీ ఇంత త్వరగా వస్తుందని నేను అనుకోలేదు. రజినీగారు, అమితాబ్‌గారు, లైకా ప్రొడక్షన్స్, ఫహాద్, రానా.. ఇలాంటి యాక్టర్స్‌తో కలిసి వర్క్ చేయటాన్ని ఎంజాయ్ చేశాను. సూపర్‌స్టార్‌గారి గురించి చెప్పాలంటే 50 ఏళ్ల ఆయన ప్రయాణం అసాధారణం. ఆఫ్ స్క్రీన్. ఆన్ స్క్రీన్‌లో ఆయనెంతో ఇన్‌స్పిరేషన్. ఆయనతో వర్క్ చేయటం డ్రీమ్ కమ్ ట్రు అనిపించింది. సపోర్ట్ చేసిన ఎంటైర్ టీమ్‌కు థాంక్స్ అన్నారు.
లైకా ప్రొడక్షన్స్ హెడ్ మాట్లాడుతూ లైకాప్రొడక్షన్స్ జర్నీ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసిన సుభాస్కరన్‌గారికి అభినందనలు. సూపర్‌స్టార్ ఈ రేంజ్‌కు ఎలా చేరుకున్నారనేది ఆయన పడే కష్టాన్ని చూస్తుంటే అర్థమవుతుంది. ఈ సినిమాకు మరోసారి ఆయనతో కలిసి ట్రావెల్ చేయటం మరచిపోలేని అనుభూతినిచ్చింది. ఇక డైరెక్టర్ జ్ఞానవేల్ చాలా మంచి వ్యక్తి. ఇండస్ట్రీలో మంచి డైరెక్టర్‌గా ఎదుగుతాడు. అనిరుద్ మా బ్యానర్‌కి దత్తపుత్రుడు. తను ఈ సినిమా రీ రికార్డింగ్ సమయంలో నాకు ఫోన్ చేసి సినిమా హిట్ అన్నారు. అప్పుడే నాకు నమ్మకం వచ్చేసింది. ఇక ఈ సినిమాలో వర్క్ చేసిన అమితాబ్, మంజు వారియర్, అభిరామి, రితికా సింగ్ సహా అందరికీ ధన్యవాదాలు అన్నారు.
సినిమాటోగ్రాఫర్ ఎస్.ఆర్.కదిర్ మాట్లాడుతూ జ్ఞానవేల్ లాంటి వ్యక్తికి సూపర్‌స్టార్ రజినీకాంత్‌గారి లాంటి స్టార్ యాడ్ అయినప్పుడు ఆ సినిమా రీచ్ ఎలా ఉంటుదనేది ఈ సినిమా చూస్తుంటే అర్థమవుతుంది. మూడు దశాబ్దాల తర్వాత అమితాబ్‌గారు, రజినీగారు కలిసి చేసిన సినిమా ఇది. మంచి సినిమాగా వేట్టైయాన్ అందరినీ మెప్పిస్తుంది అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ఎడిటర్ కె.కదిర్, ప్రొడక్షన్ డిజైనర్ ఫిలోమన్, అభిరామి, రితికా సింగ్, దుసారా విజయన్, భరత్ నారంగ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment