పలువురు తెలుగు సినీ దిగ్గజాల సమక్షంలో ఘనంగా "సోగ్గాడు" స్వర్ణోత్సవ కార్యక్రమం
నటభూషణ్ శోభన్ బాబు కథానాయకుడిగా రూపొందిన "సోగ్గాడు" చిత్రం 50 ఏళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా సురేష్ ప్రొడక్షన్స్, అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో "సోగ్గాడు" సినిమా స్వర్ణోత్సవ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ లోని కొమరం భీమ్ ఆదివాసీ భవన్ లో ఘనంగా జరిగింది. పలువురు ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, హీరోయిన్స్, రచయితలు ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో
రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ - రచయితగా నన్ను నేను నమ్ముకుని 1975లో చిత్ర పరిశ్రమకు వచ్చాను. ఆ ఏడాది "సోగ్గాడు" సినిమా రిలీజైంది. ఆ సినిమా తర్వాత శోభన్ బాబు గారు హీరోగా ఒక్కో మెట్టు పైకి అధిరోహిస్తూ వెళ్లారు. శోభన్ బాబు గారికి మహిళా అభిమానులు ఎక్కువ. నా భార్య కూడా ఆయనకు అభిమాని. శోభన్ బాబు గారు ఎన్నో చిత్రాల్లో తన విశిష్ట నటనతో ఆకట్టుకున్నారు. మానవుడు దానవుడు సినిమాలో ఆయన నటన చూస్తే ఆ రెండు పాత్రల్లో నటిస్తున్నది ఒక్కరేనా అనిపిస్తుంది. 2008లో శోభన్ బాబు గారు మనల్ని వదిలి వెళ్లారు. కానీ ఆయన ఇంకా మన మధ్యే ఉన్నారని అనిపించేలా అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి వారు ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉంది. అన్నారు.
నిర్మాత కేఎస్ రామారావు మాట్లాడుతూ - శోభన్ బాబు గారు క్రమశిక్షణ కలిగిన హీరో. నిర్మాత ఎవరైనా బడ్జెట్ లోనే సినిమా పూర్తయ్యేలా చేసేవారు. అలాంటి హీరో ఇప్పుడు మన మధ్య లేకపోవడం బాధాకరం. ఈ రోజు శోభన్ బాబు గారి సోగ్గాడు సినిమా స్వర్ణోత్సవం కార్యక్రమం నిర్వహించడం మంచి నిర్ణయం. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చాలామంది ఆయనతో కలిసి నటించిన హీరోయిన్స్ వచ్చారు. ఈ వేడుకను ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉంది. అన్నారు.
గాయని సుశీల మాట్లాడుతూ - సురేష్ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో సోగ్గాడు స్వర్ణోత్సవ కార్యక్రమం జరపడం సంతోషంగా ఉంది. ఈ సినిమాతో నాకు మంచి పేరు వచ్చింది. ఇంకా ఇలాంటి గొప్ప కార్యక్రమాలన్నీ చూసి ఆ జ్ఞాపకాలు పోగేసుకోవాలని కోరుకుంటున్నాను. రామానాయుడు గారు సురేష్ ప్రొడక్షన్స్ అనే గొప్ప సంస్థను తీర్చిదిద్దారు. శోభన్ బాబు గారి సినిమాల్లో పాడిన ప్రతి పాటా నా మదిలో ఇంకా మెదులుతూనే ఉన్నాయి. అన్నారు.
రచయిత, మాజీ రాజ్యసభ సభ్యులు యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ మాట్లాడుతూ - శోభన్ బాబు గారితో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన విశాఖ వచ్చినప్పుడల్లా కలుస్తుండేవాడిని. నా స్నేహితుడు కాట్రగడ్డ మురారిని నిర్మాతను చేసిన గొప్ప హీరో శోభన్ బాబు గారు. నేను సోగ్గాడు సినిమాను శోభన్ బాబు గారి కోసం ఒకసారి ఇద్దరు హీరోయిన్స్ కోసం మరోసారి చూశాను. ప్రేక్షకులకు షడ్రోసోపేతమైన భోజనం లాంటి వినోదాన్ని అందించింది సినిమా. అన్నారు.
నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ - సోగ్గాడు సినిమా మా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థకు ఎంతో కీలకమైన మూవీ. 1964లో మా సంస్థ స్థాపించిన తర్వాత కొన్ని మూవీస్ చేస్తూ వచ్చాం. 75లో మా సంస్థకు మళ్లీ మంచి కమ్ బ్యాక్ ఇచ్చిన సినిమా సోగ్గాడు. ఈ సినిమా శోభన్ బాబు గారి కోసమే రాశారా అనిపిస్తుంది. ఆయన తన క్యారెక్టర్ లో ఎంతో సహజంగా నటించారు. అందుకే సోగ్గాడు సినిమా అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేసింది. ఆ సినిమాకు పనిచేసిన హీరోయిన్స్ జయసుధ గారు జయచిత్ర గారు ఇంకా అనేక మంది టెక్నీషియన్స్, ఆర్టిస్టులు ఈ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉంది. ఇంకా చాలా మంది రాలేకపోయారు. సుశీల గారు మళ్లీ ఆ రోజులు గుర్తుచేసేలా పాటలు పాడారు. నేను ఈ కార్యక్రమానికి వచ్చేముందు సోగ్గాడు సినిమా మళ్లీ ఒకసారి చూశాను. ఎంతో బాగుంది అనిపించింది. అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి వాళ్లు పట్టుదలగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉంది. అన్నారు.
శోభన్ బాబు మనవడు డా.సురక్షిత్ మాట్లాడుతూ - మా తాతగారిని గౌరవించుకునేందుకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. 50 ఏళ్ల తర్వాత కూడా సోగ్గాడు మూవీని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే ఇది ఎంత గొప్ప సినిమానే అర్థమవుతోంది. ఈ చిత్రాన్ని తరతరాలు గుర్తుండేలా నిర్మించిన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థకు కృతజ్ఞతలు. సోగ్గాడు సినిమా స్వర్ణోత్సవం కార్యక్రమంతో మనకు తెలిసేది ఏంటంటే లెజెండ్స్ ఎప్పుడూ మన హృదయాల్లో ఉంటారు. తాత గారు సినిమాల్లో ఎంత కష్టపడినా కుటుంబానికి, ఆయన అభిమానులకు తగినంత సమయం కేటాయించేవారు. ప్రతి అభిమానినీ పలకరించేవారు. మాకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకునే స్వేచ్ఛను ఇచ్చారు. అందుకే నేను డాక్టర్ అయ్యాను. అన్నారు.
నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ - సోగ్గాడు టైటిల్ ను దసరా బుల్లోడు సినిమాకు పెట్టమని జగపతి రాజేంద్రప్రసాద్ గారికి సూచించాను. ఆయన దసరా బుల్లోడు బాగుంటుందని ఫిక్స్ అయ్యారు. ఆ తర్వాత రామానాయుడు గారు ఈ సినిమాకు సోగ్గాడు అని పెట్టారు. ఆయనను వాహిణీ స్టూడియోలో కలిసినప్పుడు మంచి టైటిల్ పెట్టారు, ఈ టైటిల్ 20 లక్షల ఖరీదు చేస్తుందని రామానాయుడు గారిని అభినందించాను. సోగ్గాడు సినిమా సురేష్ సంస్థకు గొప్ప పేరు, స్థిరత్వాన్ని తీసుకొచ్చింది. శోభన్ బాబు గారు మన ఇండస్ట్రీలో ఆర్థికమంత్రిలా ఉండేవారు. ప్రతి సినిమాకు లెక్క వేసుకుని చేసేవారు. అన్నారు.
నటి జయచిత్ర మాట్లాడుతూ - నాకు తెలిసి ఇండస్ట్రీలో 50 ఏళ్ల ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్న చిత్రం సోగ్గాడు. ఈ సినిమాలో నటించిన జ్ఞాపకాలు ఇంకా మనసులో అలాగే ఉన్నాయి. ఈ చిత్రంలో శోభన్ బాబు గారి లాంటి పెద్ద హీరోతో నటించే అవకాశం రామానాయుడు గారు కల్పించారు. ఈ సినిమా షూటింగ్ ఎంతో హ్యాపీగా చేశాం. శోభన్ బాబు గారికి కోపం రావడం నేనెప్పుడూ చూడలేదు. నవ్వుతూ నవ్విస్తూ ఉండేవారు. సోగ్గాడు సినిమా రిలీజై ఘన విజయం సాధించింది, తాష్కెంట్ ఫిలిం ఫెస్టివల్ కు సెలెక్ట్ అయ్యింది. ఆ ఫిలిం ఫెస్టివల్ కోసం నేను మా చిత్ర బృందంతో కలిసి రష్యా వెళ్లాను. తాష్కెంట్ లో స్క్రీన్ మీద సోగ్గాడు అని టైటిల్స్ పడగానే మాకు గర్వంగా అనిపించింది. ఈ సినిమా తర్వాత మంచి అవకాశాలు నాకు వచ్చాయి. ఇలాంటి గొప్ప చిత్రంలో భాగమై, ఇన్నేళ్ల తర్వాత స్వర్ణోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నా. అన్నారు.
నటి జయసుధ మాట్లాడుతూ - శోభన్ బాబు గారితో చాలా మూవీస్ చేశాను. ఆయనను చూసి డిసిప్లిన్ తో పాటు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకే పనిచేయాలనే పద్ధతి నేర్చుకున్నాను. శోభన్ బాబు గారు అంటే మా హీరోయిన్స్ అందరికీ చాలా ఇష్టం. మా అందరితో ఎంతో బాగుండేవారు. ఇలాంటి గొప్ప అభిమానులు ఉండటం శోభన్ బాబు గారి అదృష్టం. ఆయన ఇవాళ మన మధ్య భౌతికంగా లేకపోయినా సోగ్గాడు స్వర్ణోత్సవ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా అభిమానులు నిర్వహిస్తుండటం సంతోషకరం. ఈ ఈవెంట్ గురించి తెలిసి ఉంటే ఇంకా చాలా మంది శోభన్ బాబు గారి హీరోయిన్స్ వచ్చేవారు. ఈ వేదిక నిండిపోయేది. నాకు శోభన్ బాబు గారితో ఉన్న అనుబంధం గురించి ఇప్పటికే చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను. అవన్నీ మీకు తెలుసు. మేమిద్దరం 38 సినిమాల్లో నటించాం. నిన్ను చూస్తుంటే బోర్ కొడుతుంది అని సరదాగా అనేవారు. రోజంతా మేము వివిధ సినిమాల్లో కలిసే నటించేవాళ్లం. నా జర్నీ శోభన్ బాబు గారితో, రామానాయుడు గారితో ఎలా ఉండేదో ఒక పుస్తకం రాయొచ్చు. రామానాయుడు గారి గొప్ప ప్రొడ్యూసర్ ను నేను చూడలేదు. ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం కల్పించిన దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అన్నారు.
నటి సుమలత మాట్లాడుతూ - శోభన్ బాబు గారు హీరోయిన్స్ ను గౌరవించేవారు. సినిమా ఇండస్ట్రీలో, జీవితంలో ఎలా ఉండాలో సూచించేవారు. పర్సనల్ లైఫ్, కెరీర్ ను ఎలా విభజించుకోవాలో చెప్పేవారు. నేను చాలా జూనియర్ ను. కానీ సుమలత గారు అనే పిలిచేవారు. సీనియర్ హీరో అని భయపడతానని కంఫర్ట్ గా ఉంచేవారు. ఆయన సోగ్గాడు సినిమా స్వర్ణోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్న ఆయన అభిమానులకు, సురేష్ సంస్థకు నా అభినందనలు చెబుతున్నా. అన్నారు.
నటి రాధిక శరత్ కుమార్ మాట్లాడుతూ - శోభన్ బాబు గారి అందంగా ఉండటమే కాదు అందమైన వ్యక్తిత్వం కలవారు. ఆయన తన సినిమా సెట్ లో ఉండగా మరో సినిమా గురించి, మరొకరి గురించి మాట్లాడగా నేను వినలేదు. ఆ సినిమా, ఆ క్యారెక్టర్ గురించి మాత్రమే ఆలోచించేవారు. టైమ్ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ గురించి చెప్పేవారు. ఆయన డిసిప్లిన్ మా అందరికీ వచ్చింది. నేను పిన్ని సీరియల్ చేస్తున్నప్పుడు ఆ సీరియల్ చాలా బాగుందనే ఫోన్ చేసి చెప్పేవారు. గత వారం రిలీజైన సినిమా గురించే ఎవరికీ గుర్తుండని రోజులు ఇవి. అలాంటిది 50 ఏళ్ల సోగ్గాడు సినీ స్వర్ణోత్సవం నిర్వహించడం నిజంగా గొప్ప విషయం. అన్నారు.
నటి ప్రభ మాట్లాడుతూ - మీ అందరిలాగే నేనూ శోభన్ బాబు గారి అభిమానినే. నేను ఆయనతో చేసిన సినిమాల కన్నా, చేయలేక మిస్ అయిన సినిమాలే చాలా ఉన్నాయి. అవి కావాలని కాదు, అనివార్య కారణాలతో ఆ సినిమాలు మిస్ అయ్యాను. నేను నా జీవితంలో శోభన్ బాబు గారిని, రామానాయుడు గారిని ఎప్పుడూ మర్చిపోలేను. అన్నారు.
నటి రోజా రమణి మాట్లాడుతూ - నేను శోభన్ బాబు గారికి చెల్లిగా 9 సినిమాల్లో నటించాను. ఆయన నన్ను సిస్టరీ అని పిలిచేవారు. శోభన్ బాబు గారి చెల్లి చిన్నప్పుడే చనిపోయిందట. ఆయన నన్ను చెల్లి అని ప్రేమగా చూసుకునేవారు. ఆయన సోగ్గాడు సినిమా స్వర్ణోత్సవం జరుపుకోవడం ఒకవైపు సంతోషం అయితే, ఆయన మన మధ్య లేకపోవడం బాధగా ఉంది. అన్నారు.
ఈ కార్యక్రమంలో శోభన్ బాబు మరో మనవడు సౌరభ్ కూడా పాల్గొన్నారు.
అతిథులు అందరినీ కార్యక్రమ నిర్వాహకులు శాలువాతో సత్కరించారు.
Comments
Post a Comment