కింగ్డమ్ మూవీ రివ్యూ & రేటింగ్ !!!
కథ: అంకాపూర్ పోలీస్ స్టేషన్‌లో సూరి (విజయ్ దేవరకొండ) కానిస్టేబుల్. అన్యాయాన్ని చూస్తే ఆవేశానికి గురై చిక్కుల్లో పడుతుంటాడు. చిన్నతనంలో పారిపోయిన తన అన్న శివ (సత్యదేవ్) కోసం వెతుకుతుంటాడు. ఓ సమస్యలో ఇరుక్కుపోయిన సూరి సస్పెన్షన్ వేటు పడే సమయంలో తన ఉన్నతాధికారి ఓ సీక్రెట్ మిషన్‌ను అప్పగిస్తాడు. ఆ ఆపరేషన్ చేయడానికి ఇష్టం లేకపోయినా.. శ్రీలంకలో ఉన్న తన అన్న శివను కలిసే అవకాశం రావడంతో ఒప్పుకొంటాడు. దాంతో స్పెషల్ ఆపరేషన్ కోసం శ్రీలంకలో అడుగుపెడుతాడు. చిన్నతనంలో తన అన్న శివ ఇంటి నుంచి ఎందుకు పారిపోతాడు? తన తండ్రి మరణానికి శివ ఎందుకు కారణమయ్యాడు? శ్రీలంకలో ఓ జాతికి శివ ఎలా నాయకుడయ్యాడు? శ్రీలంకలో అడుగుపెట్టిన సూరికి ఎదురైన సమస్యలు ఏమిటి? శివను సూరి ఇండియాకు తీసుకు రావాలన్న ప్రయత్నాలు ఎలా కొనసాగాయి? శివకు, మురుగన్ (వెంకటేష్ వైపీ)కి ఉన్న వైరం ఏమిటి? శ్రీలంక డాక్టర్‌గా పనిచేసే మధు (భాగ్యశ్రీ భోర్సే) సూర్యకు ఎలా సహకరించింది? శ్రీలంకలో తెలుగు జాతిపై వివక్ష ఎందుకు కొనసాగుతుంది? బ్రిటీష్ కాలంలో తెలుగు జాతి ఎందుకు శ్రీలంకకు వలస పోయింది? పోలీస్ ఆపరేషన్‌పై వెళ్లిన సూరి తెలుగు జాతికి నాయకుడు ఎలా అయ్యాడు? అనే ప్రశ్నలకు సమాధానమే కింగ్డమ్ సినిమా కథ.
విశ్లేషణ:
బ్రిటిష్ కాలంలో శ్రీకాకుళంలో బంగారు గని కార్మికుల నేపథ్యంతో కథ ఎమోషనల్‌గా మొదలవుతుంది. ఈ సినిమా కథకు చక్కటి లీడ్ ఇచ్చి.. కథను భావోద్వేగంగా మార్చడంలో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తన ప్రతిభను చాటుకొన్నాడు. అయితే కథ బలంగా చెప్పే క్రమంలో కొన్నిసార్లు ట్రాక్ మిస్ అయ్యాడనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ దర్శకుడు తడబాటుకు గురైన ప్రతీసారి విజయ్ దేవరకొండ తన డ్యూటీని సక్రమంగా చేసి బలహీనమైన సన్నివేశాలకు మరింత బలం చేకూర్చాడు. స్టోరి పాయింట్‌లో హై ఎనర్జీ ఉన్నప్పటికీ.. దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాల్సి ఉండాల్సిందనే ఫీలింగ్ కలుగుతుంది. హై ఓల్డేజ్ ఓపెనింగ్ తర్వాత ఫస్టాఫ్‌ను మరీ స్లోగా నడిపించాడు. కానీ ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు వేగం పెంచి సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచడంలో గౌతమ్ సక్సెస్ అయ్యాడు.
సెకండాఫ్‌లో పెట్టుకొన్న భారీ అంచనాలకు తగినట్టుగానే కొన్ని సీన్లను అద్బుతంగా డిజైన్ చేసుకొన్నారు. సెకండాఫ్‌లో చాలా అప్ అండ్ డౌన్స్ ఉండటం వల్ల స్టోరి మరింత బలహీనంగా కనిపిస్తుంది. కానీ విజయ్ దేవరకొండ, సత్యదేవ్, వెంకటేష్ వైపీ ముగ్గురు ఈ సినిమా భారాన్ని భుజాన వేసుకొని తమ పెర్ఫార్మెన్స్‌తో రక్తికట్టించారు. ప్రీ క్లైమాక్స్ నుంచి వచ్చే సన్నివేశాలు హై ఎమోషనల్, ఓల్టేజ్‌తో ఉండటంతో మూవీ ఫుల్లుగా కనెక్ట్ అయ్యేలా చేసిందని చెప్పాలి.
సూరిగా విజయ్ దేవరకొండ తన ఫెర్ఫార్మెన్స్‌తో చెలరేగిపోయాడు. కీలక సన్నివేశాల్లో హై ఎన్జరీతో సన్నివేశాలకు ప్రాణం పోశాడు. కొన్ని సీన్లలో ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ చాలా బాగున్నాయి. ఈ సినిమాకు విజయ్ దేవరకొండ యాక్టింగ్ ఓ మ్యాజిక్ అని చెప్పాలి. భాగ్యశ్రీ భోర్సే డాక్టర్‌గా సపోర్టింగ్ రోల్‌కే పరిమితమయ్యారు. తన పాత్రకు స్కోప్ ఉన్నా.. నటించడానికి అవకాశం లేకపోయింది. గ్లామర్‌పరంగా కూడా వెనకబడింది. సత్యదేవ్ ఎప్పటిలానే పవర్ ప్యాక్డ్‌గా కనిపించడమే కాకుండా విజయ్ దేవరకొండతో పోటాపోటీగా నటించాడు. విలన్ పాత్రలో వెంకటేష్ వైపీ స్పెషల్ ఎట్రాక్షన్. కసిరెడ్డి డిఫరెంట్ రోల్‌లో మెప్పించే ప్రయత్నం చేశారు. మిగితా పాత్రల్లో నటించిన వారంతా ఫర్వాలేదనిపించారు.
ఈ సినిమా అత్యంత బలం అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్. అనిరుధ్ ఇచ్చిన బీజీఎం వల్లనే చాలా సన్నివేశాలు తెర మీద సజీవంగా కనిపించాయి. ఇక సినిమాటోగ్రఫి ఈ సినిమాకు మరో అదనపు బలం. ఎడిటింగ్ విభాగానికి ఇంకా చాలానే పని ఉందనే విధంగా వారి పనితీరు కనిపించింది. ఆర్ట్ వర్క్ ఫెంటాస్టిక్. సినిమా మూడ్‌ను బాగా క్రియేట్ చేసింది. నాగవంశీ అనుసరించిన ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్‌గా ఉన్నాయి. సినిమాలోని ప్రతీ ఫ్రేమ్ చాలా రిచ్‌గా ఉంది.
జాత్యహంకారం, అధిపత్య పోరాటం అంశాలను బేస్ చేసుకొని రాసుకొన్న ఎమోషనల్ స్టోరి.అన్నదమ్ముల సెంటిమెంట్ ఈ సినిమాను ముందుకు నడివిజయ్ పించేలా చేసింది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఈ సినిమాను హిట్‌గా మార్చిందని చెప్పాలి. ఇతర నటీనటుల ఫెర్ఫార్మెన్స్, యాక్షన్ సీన్లు,సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయింది. డిఫరెంట్ సినిమాలు చూడాలనుకొనే వారికి ఈ సినిమా కేరాఫ్ అడ్రస్. థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న చిత్రం.
రేటింగ్: 3.25/5
Comments
Post a Comment