"పలాస 1978" మూవీ రివ్యూ & రేటింగ్ !!!

సినిమా: పలాస
నటీనటులు: రక్షిత్, నక్షత్ర తదితరులు
పాటలు : భాస్కర భట్ల, సుద్దాల అశోక్ తేజ, లక్ష్మీ భూపాల, ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ : అరుల్ విన్సెంట్, సంగీతం : రఘు కుంచె,
కో ప్రొడ్యూసర్ : మీడియా 9 మనోజ్ 
పి.ఆర్.ఓ : జి.ఎస్.కె మీడియా, 
నిర్మాత : ధ్యాన్ అట్లూరి.  
రచన- దర్శకత్వం : కరుణ కుమార్.
కరుణ కుమార్ తీసిన "పలాస" మీద మొదట్నుంచీ ఒక వర్గంలో అంచనాలు బాగానే ఉన్నాయి. ట్రైలర్లో ఒకటి రెండు డయలాగులు కూడా బానే పేలాయి. మొత్తమ్మీద ఈ సినిమాలో "రంగస్థలం" మాదిరిగా రెండు కులవర్గాల నేపథ్యంలో సాగే కథలా అనిపించింది. ఇంతకీ ఇందులో ఏముంది, ఎలా ఉంది అనేవి చూద్దాం.

కథ:
1978 కాలంలో ఊర్లో పెద్ద షావుకారు (జన్ని). అతనికొక తమ్ముడు. పేరు గురుమూర్తి (రఘు కుంచె). వీళ్లు ఆ ఊరికి పెద్దలు. జంధ్యం వేసుకునే ఒకానొక కులానికి చెందిన వాళ్లు. వీళ్ల కనుసన్నల్లో ఊరు నడుస్తుంటుంది. ఆధిపత్యం వల్ల వచ్చిన పొగరు వీళ్ల సొంతం. అలాగే బడుగు కులాల వారిని హీనంగా చూడడం, పశువుల్ని బాదినట్టు బాదడం వీళ్ల జన్మహక్కులా భావిస్తూ జీవిస్తుంటారు. ఇంతకీ ఈ అన్నదమ్ములిద్దరికీ పడదు. వీళ్లు ఈ సినిమాలో విలన్లు. అదలా ఉంటే కాళ్లకి గజ్జెకట్టి దేవుడి ముందు ఆడే కులానికి చెందిన ఒక బలవంతుడైన కుర్రాడు. పేరు మోహన రావు (రక్షిత్). అదే వాడలో అతనికి ఇష్టమైన ఒక అమ్మాయి (నక్షత్ర). ఈ మోహన రావుకి ఒక అన్న (తిరువీర్). ఈ అన్నదమ్ములిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. వీళ్లు మన హీరోలు. ఇక ఈ కథలో మరో ముఖ్య పాత్ర పోలీస్ ఎస్.ఐ సెబాస్టియన్ (రామరాజు). పైన పేర్కొన్న విలన్ అన్నదమ్ములు ఈ హీరో అన్నదమ్ముల్ని ఎలా వాడుకుందామనుకుంటారు? చివరికి ఎవరు ఏమౌతారు? ఎవరెవరు ఎవరెవరి చేతుల్లో చస్తారు? అదంతా ఒక భారతమంత కథ.

విశ్లేషణ:
మోహన్ రావుగా రక్షిత్ చక్కని నటన్నని కనబరిచాడు. సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. జార్జ్ రెడ్డిలో కనిపించిన తిరువీర్ కూడా పాత్రకు తగ్గ నటన చాలా సహజంగా చేసాడు.

హీరో రక్షిత్ అద్భుతంగా నటించాడు, డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న రోల్ లో నటించి మెప్పించాడు.
నక్షత్ర తెర మీద అందంగా కనిపించింది. తన నటనా ప్రతిభ బాగుంది. ఇక చెప్పుకోదగ్గ నటన పెద్దషావుకారుగా చేసిన జన్నీది. చాలా అనుభవమున్న నటుడిగా చేసాడు.

ఇక సింగర్ కం మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె విలన్ గురుమూర్తి పాత్రలో జీవించాడు. 1978 నుంచి 2018 వరకు జరిగే ఈ కథలో రెండు మూడు రకాల గెటప్పులతో కనిపించాడు. విలన్ గా సీరియస్సుగా ఫోకస్ పెట్టొచ్చు.ఇక సెబాస్టియన్ పాత్రధారి కూడా మెప్పించాడు. అయితే అతని వాయిస్ లో ఇంకొంచెం బేస్ ఉంటే పాత్రకి నిండుదనం వచ్చేది.

రియలిస్టిక్ గా అనిపిస్తూనే ఫైట్లు, హీరోయిజం విషయంలో మళ్లీ కమెర్షియల్ పంథాని తొక్కింది ఈ సినిమా. అది కూడా అతికినట్టే ఉండడం వల్ల ఇబ్బంది పెట్టదు.

రఘు కుంచె సంగీతాన్ని కూడా మెచ్చుకుని తీరాలి. రెండున్నర గంటల సేపు కూర్చోబెట్టగలిందంటే దర్శకుడి ప్రతిభతో పాటూ సంగీత దర్శకుడి పనితనం కూడా కలిసిరాబట్టే.

షార్ట్ ఫిలిమ్స్ తీయడంలో జాతీయ స్థాయి అవార్డులు పొందిన ట్యాలెంటడ్ దర్శకుడు కరుణ కుమార్. దలితవాదం ఆత్మగా వచ్చే సినిమాలు తెలుగులో తక్కువ. అరవంలో అయితే మామూలే. పలాసలో ఆ వాదం ఉన్నా అందరినీ ఆకట్టుకునే తీరులో ఉంది. రంగస్థలం స్ఫూర్తి ఈ సినిమాలో కనిపిస్తున్నా ఇది పూర్తి స్వతంత్ర కథ. ఏ పాత్రా వృధా కాదు. ప్రతిదీ ఎంతోకొంత ఇంపార్టెన్స్ ఉన్నదే. కథ రాసుకోవడం నుంచి తీసి మెప్పించడం వరకు దర్శకుడు పడ్డ కృషి ఆద్యంతం కనిపిస్తుంది. బోరు కొట్టని కథనం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకునే ప్రేక్షకులు ఈ సినిమా చూడాలి. అదేంటి..ఎవరైనా అలాంటి సినిమానే కదా చూడాలనుకునేది అంటారా? అందరూ కొత్త మొహాలతో కథనం నడపడం కష్టమైన పని. అయినా సరే దర్శకుడు తన ప్రతిభతో మెప్పించాడు.

చివరిగా: పలాస ఒక నిజాయితీ చిత్రం

రేటింగ్: 3.5/5

Post a Comment

1 Comments

  1. Super duper Hit. Hero Mohan Rao
    Excellent performance.police officer Sabastain good performance. Total picture Super.

    ReplyDelete